ఉద్యోగాల కల్పనలో రేవంత్ సర్కార్ విఫలం: తమ్మినేని

కలం, ఖమ్మం బ్యూరో: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, ఉద్యోగాల కల్పనలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను శాసనమండలిలో ప్రశ్నించేందుకు ఖమ్మం – వరంగల్ – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి, సీనియర్ న్యాయవాది కొల్లి సత్యనారాయణను గెలిపించాలని పిలుపునిచ్చారు. ​ఆదివారం ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన మూడు ఉమ్మడి జిల్లాల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. గతంలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు నిలిపిన పీడీఎఫ్ పోరాట వారసత్వాన్ని సత్యనారాయణ కొనసాగిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ‘జెన్-జీ’ ఉద్యమాలకు ఎర్రజెండా నినాదాలే స్ఫూర్తి అని పేర్కొన్నారు.

ఆ రెండు పార్టీల నేతలు కోరినా..

​సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మద్దతు కోరినా.. ఎర్రజెండా సత్తా చాటేందుకు పీడీఎఫ్ అభ్యర్థి సత్యనారాయణ విజయానికే సీపీఎం సర్వశక్తులూ ఒడ్డుతుందని స్పష్టం చేశారు. రైతాంగ సంక్షోభాన్ని ప్రభుత్వం విస్మరించిందని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు విమర్శించారు. ​పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాల ఆత్మగా మండలిలో గళమెత్తుతానని హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రజాసంఘాల సూచనలతో మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>