డీలిమిటేషన్‌పై తమిళనాడు సంచలన నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తమిళనాడు (Tamil Nadu) రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. డీలిమిటేషన్ ప్రక్రియను తమ రాష్ట్రం అంగీకరించబోదని సీఎం విజయ్ స్పష్టం చేశారు. త్వరలో అసెంబ్లీలో ఈ మేరకు ప్రత్యేక తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. శనివారం సీఎం జోసెఫ్ విజయ్ అధ్యక్షతన అధికారపార్టీ కూటమి ఎంపీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ ప్రాతినిధ్యంలో ఎలాంటి మార్పు రాకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని సమావేశంలో పాల్గొన్న ఎంపీలు అభిప్రాయపడ్డారు.

తమిళనాడు ప్రయోజనాలకు విరుద్ధం

డీలిమిటేషన్ పేరుతో ప్రజాప్రతినిధుల సంఖ్యలో మార్పులు చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని నేతలు పేర్కొన్నారు. కనీసం మరో 40 నుంచి 50 ఏళ్ల వరకు సీట్ల సంఖ్యను మార్చకుండా కొనసాగించాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. లోక్‌సభ మొత్తం 543 స్థానాలు, తమిళనాడుకు ఉన్న 39 స్థానాల విషయంలోనూ ప్రస్తుత సంఖ్యను కొనసాగించాలన్న ప్రతిపాదనకు మద్దతు లభించింది. సీఎం విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సంప్రదింపుల సమావేశానికి అధికార కూటమికి చెందిన కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ ఎంపీలతో పాటు సీపీఐ, సీపీఎం వంటి మిత్రపక్షాల నుంచి 19 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపీ జోతిమణి మాట్లాడుతూ.. డీలిమిటేషన్ ప్రక్రియకు తమ పార్టీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రయోజనాలు, హక్కులను కాపాడేందుకు సీఎం విజయ్ తీసుకున్న చర్యను ఆమె స్వాగతించారు.

డీఎంకే దూరం !

ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే హాజరుకాలేదు. సమావేశాన్ని రాజకీయ నాటకంగా అభివర్ణించిన ఆ పార్టీ నేత కనిమొళి కరుణానిధి.. డీలిమిటేషన్ అంశంతో పాటు కర్ణాటక ప్రతిపాదించిన మేకెడాటు ప్రాజెక్టుపై తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. మేకెడాటుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి రాష్ట్ర ఎంపీలతో కలిసి దాన్ని సమర్పించేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారా అని సవాల్ చేశారు. డీలిమిటేషన్‌పై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని డీఎంకే ఇప్పటికే స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>