కలం వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ (Secunderabad) కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు బీఆర్ఎస్ (BRS) పోరాటం ఆగదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లో పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ర్యాలీని అనుమతించకపోవడంపై తలసాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శాంతియుత ర్యాలీకి అనుమతిచ్చినట్లే ఇచ్చి ముందు రోజు రాత్రి నిరాకరించారని మండిపడ్డారు. తాము ఎవరితో గొడవలు పెట్టుకోవడం లేదని, దుకాణాలు మూయించడం, ధర్నాలు, రాస్తారోకోలు వంటివి చేయడం లేదన్నారు. కేవలం శాంతియుతంగా ర్యాలీ చేయాలనుకున్నట్లు చెప్పారు. గాంధేయ మార్గంలో హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో వెళ్లడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.
ఇప్పటికైనా ప్రభుత్వంలో కదలిక వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అనుమతులు తీసుకొని ఈ ర్యాలీ చేపట్టేలోపు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోకపోతే ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఇది సికింద్రాబాద్ అస్తిత్వానికి , ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే తమ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. శనివారం పలువురిని అరెస్ట్ చేశారని తెలిపారు. చాలా సేపు కొందరిని స్టేషన్‌లో ఉంచి ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. అయినా యువత, కార్యకర్తలు ధైర్యంగా పోరాడారని అభినందించారు.

Read Also: మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగొద్దు.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
Follow Us On: Sharechat


