కలం, స్పోర్ట్స్: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 11 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ కోసం ప్రకటించిన ముంబై జట్టులో ఆయనకు చోటు దక్కలేదు. తాను ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపినప్పటికీ సెలెక్టర్లు ఆయనను పక్కన పెట్టడం గమనార్హం. చండీగఢ్‌తో జరిగే తొలి పోరుకు సిద్ధేష్ లాడ్ సారథ్యంలోని 16 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. భవిష్యత్తు నాయకుడిగా తీర్చిదిద్దే క్రమంలో 19 ఏళ్ల యువ బ్యాటర్ ఆయుష్ మాత్రేకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.
భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ అందుబాటులో ఉండటంతో ఆయనను జట్టులోకి తీసుకున్నారు. గత 18 నెలలుగా సూర్యకుమార్ రెడ్ బాల్ క్రికెట్ ఆడకపోవడంతో, ఆయనకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని సెలెక్టర్లు భావించారు. లయ అందుకోవడానికి కొన్ని మ్యాచులు ఆడిన తర్వాతే జట్టులోకి పరిగణనలోకి తీసుకుంటామని ముంబై సెలెక్షన్ కమిటీ చైర్మన్ రమేష్ పొవార్ స్పష్టం చేశారు.
గాయం కారణంగా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ప్రైవేట్ వేలంలో రాణించిన దివ్యాంశ్ సక్సేనా తిరిగి జట్టులోకి రాగా, ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి దిగ్గజాలు బ్యాటింగ్ విభాగానికి బలాన్ని ఇస్తున్నారు. ఎలైట్ గ్రూప్-డిలో ఉన్న ముంబై డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

