కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలోని అమీన్పూర్ సర్కిల్ ఐలాపూర్ తండాలో (Ilapur Thanda) అక్రమ నిర్మాణాలపై అధికారులు మరోసారి కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అక్రమ కట్టడాలను రెవెన్యూ యంత్రాంగం నేలమట్టం చేసింది. శనివారం అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేశం ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఐలాపూర్ తండాలో విస్తృతంగా కూల్చివేతలు చేపట్టారు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పలు అక్రమ నిర్మాణాలతో పాటు కొత్తగా వేసిన బేస్మెంట్లను జేసీబీల సహాయంతో పూర్తిగా తొలగించారు.
గతంలోనూ అధికారులు ఇక్కడ పలుమార్లు అక్రమ నిర్మాణాలను కూల్చివేసినప్పటికీ కబ్జాదారుల ఆగడాలు ఆగడం లేదు. ఎలాంటి అనుమతులు, సరైన యాజమాన్య పత్రాలు లేకుండానే కోర్టు కేసుల్లో వివాదాస్పదంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా భారీగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి, అమాయకులకు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు, ప్రభుత్వ భూములను కబ్జా చేసినా, అక్రమంగా నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కూల్చివేతల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందితో పాటు మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

