కలం, తెలంగాణ బ్యూరో : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెంచడానికి, పరిశోధనలు ముమ్మరం కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విధాన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (AI Impact Summit)లో అదానీ, అంబానీ గ్రూపులు సహా మల్టీ నేషనల్ కంపెనీలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయి. స్మార్ట్ వర్క్ తో ఉత్పత్తిని పెంచవచ్చని, పౌర సేవలను సులభతరం చేయొచ్చన్నది ప్రభుత్వాల ఉద్దేశం. కానీ, అదే టెక్నాలజీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీస్తున్నది. అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా ఏఐ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడుతున్నారు. చివరకు సూసైడ్‌లకు సైతం దాన్నే ఆశ్రయిస్తున్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో ఇద్దరు విద్యార్థినుల సూసైడ్‌లో (Surat Tragedy) ఏఐ ఎలా సహాయపడిందీ పోలీసులు వెలికితీశారు.
సుఖమైన సూసైడ్ సలహాలిచ్చిన ఏఐ :
డిగ్రీ చదువుతున్న ఇద్దరు యువతులు ఏఐ ఇచ్చిన సలహా ప్రకారం సూసైడ్ చేసుకున్నారు. చిన్నప్పటి నుంచీ ఇద్దరూ స్నేహితులని, సూసైడ్ చేసుకోవాలనే నిర్ణయానికి కారణాలు తెలియకపోయినా వారు సుఖంగా చనిపోవడానికి మాత్రం ఏఐ నుంచి సలహా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బీ.కామ్ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు సూరత్‌లోని స్వామి నారాయణ టెంపుల్ సమీపంలోని ఒక వాష్‌రూమ్‌లో చనిపోయి ఉన్నారని, వారి పక్కన మత్తు ఇంజెక్షన్లు, సిరంజీలు ఉన్నాయని, వారి మొబైల్ ఫోన్లలో కొన్ని ఫొటోలు కూడా లభ్యమైనట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎన్‌పీ గోహిల్ మీడియాకు వివరించారు. వారు కాలేజీకి వెళ్లిన తర్వాత రాత్రి వరకూ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాద మేరకు వారి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కొన్ని క్లూలు లభించాయని తెలిపారు. వాటి ప్రకారం సీసీటీవీ ఫుటేజ్‌ను తీసుకున్నామని, చివరకు సూసైడ్ చేసుకున్న ప్రాంతాన్ని గుర్తించామన్నారు.
ఫోన్ల ఏఐ సెర్చ్ హిస్టరీతో వెలుగులోకి :
సూసైడ్ చేసుకున్న ఇద్దరు యువతుల మొబైల్ ఫోన్లను అన్‌లాక్ చేసి పరిశీలించిన తర్వాత వారు ఏఐ ప్లాట్‌ఫామ్ సెర్చ్ హిస్టరీతో వివరాలు వెల్లడైనట్లు ఏసీపీ తెలిపారు. ఆత్మహత్య ఎలా చేసుకోవాలి… ఎలాంటి మందులు వాడొచ్చు.. సూసైడ్ చేసుకోడానికి ఉన్న మార్గాలేంటి?.. ఇలాంటి అంశాలతో ఏఐ లో వెదికారని తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో ఒక నర్సు మత్తు ఇంజెక్షన్ ద్వారా సూసైడ్ చేసుకున్న వివరాలను, ఆమె ఫోటోను కూడా ఈ ఇద్దరు యువతులు పరిశీలించారని, వారి మొబైల్ ఫోన్లలో ఆ నర్సు ఫోటో దొరికిందని తెలిపారు. మృతదేహాల పక్కన మత్తు ఇంజెక్షన్లు, మూడు సిరంజీలు, వాటిని వాడుతున్న ఫోటోలు దొరికాయన్నారు. సూసైడ్ చేసుకోవాలన్న నిర్ణయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియలేదని, ఫోన్లను ఫోరెన్సిక్ టీమ్ విశ్లేషించిన తర్వాత కొంత క్లూ దొరికే అవకాశముందన్నారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగానే నమోదు చేస్తున్నట్లు వివరించారు. స్మార్ట్ వర్క్, సత్వర సేవలకు ఉపయోగపడాల్సిన ఏఐ చివరకు సూసైడ్ చేసుకోడానికి కూడా సలహాలు ఇస్తుండడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. భవిష్యత్తులో ఏఐ వినియోగంపై ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు పెడతాన్నది కీలకంగా మారింది.
Read Also : సచిన్ వల్లే నా ఆట మారింది: సంజూ శాంసన్
Follow Us On: X(Twitter)

