కలం, వెబ్ డెస్క్: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Aleti Maheshwar Reddy) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను కౌశిక్ రెడ్డి, కేటీఆర్ పిటిషన్లకు జత చేసింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ అమలు చేయడం లేదని ఏలేటి సుప్రీంకోర్టు వద్ద ప్రస్తావించారు. మహేశ్వరరెడ్డి పిటిషన్‌పై సమాధానం చెప్పాలని నోటీసులు ఇచ్చిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం.. అన్ని పిటిషన్లపై విచారణను వచ్చే నెల 6 కు వాయిదా వేసింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ వ్యవహరించిన తీరుపై ఏలేటి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించారని ఏలేటి సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న అంశంలో స్పీకర్ జాప్యం చేయడమే కాకుండా, వారికి క్లీన్ చీట్ ఇచ్చే విధంగా వ్యవహరించారని తన పిటిషన్‌లో Aleti Maheshwar Reddy పేర్కొన్నారు. ఇది న్యాయస్థాన ధిక్కరణకు సమానమని ఆయన వాదించారు.
అయితే ఇదే కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉందని.. మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కూడా దానికి జత చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో ఒకే తరహా అంశాలు ఉన్నందున రెండు పిటిషన్లను కలిపి విచారించడం సముచితమని ధర్మాసనం అభిప్రాయపడింది.


