కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు (Job Notifications) వేయకుండా కాలాయపన చేస్తోందని విద్యార్థి సేన మండిపడింది. జులై నెలలోగా ఎన్నికల హామీల ఇచ్చిన ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేకపోతే ఆగస్టు 6న గన్‌పార్క్ వద్ద భారీ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని గన్‌పార్క్ వద్ద విద్యార్థి సేన ఆందోళనకు దిగింది. నిరుద్యోగ యువతను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఫ్యూచర్ సిటీ, ఢిల్లీపై ఉన్న శ్రద్ధ, రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై ఏమాత్రం లేదని ఆరోపించారు.
ఇచ్చింది 16 వేల ఉద్యోగాలు మాత్రమే..
ప్రభుత్వం వచ్చి మూడేళ్లవుతున్నా.. కనీసం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారని విమర్శించారు. తొలి ఏడాదిలోనే భారీగా ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులను నమ్మించారని సేన నాయకులు మండిపడ్డారు. గత మూడేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల తల్లిదండ్రులు అప్పులు చేసి తమ పిల్లలకు కోచింగ్ ఫీజులు చెల్లిస్తున్నారని.. కానీ, ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయకుండా జాప్యం చేస్తూ వస్తోందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

