అమెరికా – ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన!

కలం, వెబ్ డెస్క్ : అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణం వేళ అంతర్జాతీయంగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై జరపాలని భావించిన ఉమ్మడి సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. యుద్ధాన్ని ముగించేందుకు ఉద్దేశించిన ఒక ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు విజయవంతం కావడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా వివరాలను పంచుకున్నారు.

ఈ కొత్త ఒప్పందంలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గమైన ‘స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ని తక్షణమే, పూర్తిగా పునఃప్రారంభించనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఈ జలసంధిని ఇరాన్ మూసివేసింది. కాగా, ఈ ప్రతిపాదిత ఒప్పందం ద్వారా ఇరాన్ అణు ముప్పునకు కూడా శాశ్వత ముగింపు పడనుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ సంక్షేమంతో పాటు ఇరాన్ పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఈ దాడుల ప్రణాళికను రద్దు చేయడానికి అంగీకరించానని, అయితే ఇది ఇరాన్ ఎంత వేగంగా ఒప్పందాన్ని ఖరారు చేస్తుంది అనే అంశంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

మరోవైపు ఇరాన్‌తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అమెరికాతో కలిసి పనిచేయడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. అంతకుముందు శనివారం ఇరాన్‌లోని ఇంధన వనరులే లక్ష్యంగా భారీ దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా వ్యూహాలు రచించినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్ వైఖరి మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని క్యాంప్ డేవిడ్ వేదికగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ హెచ్చరించారు కూడా. అయితే, తాజాగా ఇరాన్ చర్చలకు ముందుకు రావడం, ప్రాంతీయ దేశాలు చొరవ చూపడంతో దాడుల ప్రణాళికను తాత్కాలికంగా పక్కన పెట్టి, శాంతి చర్చలకు అమెరికా మొగ్గు చూపినట్లయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>