కలం, వెబ్‌డెస్క్: బీహార్ (Bihar)లోని సుపౌల్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒక రైతు తన పొలంలో కనిపించిన మొసలి (Crocodile)ని భీమ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు భుజంపై మోసుకుంటూ తీసుకువెళ్లాడు. పొలంలో మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, గ్రామస్తులు ఎవరికీ ఎలాంటి హాని కలగకుండా దానిని పట్టుకుని, తాడుతో మూతిని కట్టేశారు.
అమిత కుమార్ అనే రైతు ముందు ఆ మొసలిని అటవీ శాఖ కార్యాలయానికి తీసుకువెళ్లాడు. అక్కడ అధికారులు, సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో రోడ్డుపై నడుచుకుంటూ మొసలిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసేందుకు దారి పొడవునా జనం గుమిగూడాడారు. చాలామంది దీన్ని తమ ఫోన్లలో వీడియోలు రికార్డు చేశారు. పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో, వారు వచ్చి మొసలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని కోసి నదిలో సురక్షితంగా వదిలిపెట్టారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, చెరువుల్లో నీటి మట్టం పెరగడం వల్లనే ఈ మొసలి ఆ ప్రాంతానికి వచ్చి ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు.

