కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరపాలక సంస్థలో కొంతమంది ఉద్యోగులు, అధికారులు విధి నిర్వహణకు సరైన సమయానికి హాజరు కావడం లేదనే సమాచారంతో కరీంనగర్ మేయర్ (Karimnagar Mayor) కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పలువురు ఉద్యోగులు నిర్ణీత సమయానికి హాజరు కాకపోవడాన్ని గమనించిన మేయర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవలో ఉన్న ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించడం విధిగా భావించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని సూచించారు.
నగరపాలక సంస్థలో ప్రజలకు సంబంధించిన అనేక సేవలు ప్రతిరోజూ అందించాల్సి ఉంటుందని, ఉద్యోగులు ఆలస్యంగా రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని మేయర్ పేర్కొన్నారు. ఇకపై అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు హాజరై తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అనవసరంగా ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని మేయర్ స్పష్టం చేశారు. ప్రజాసేవలో క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా వ్యవహరించడం ప్రతి ఉద్యోగి విధి అని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

