కలం, కరీంనగర్ బ్యూరో: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్’ కార్యక్రమాలు కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నాయి. అందులో భాగంగా గురువారం నాలుగవ రోజు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నగరంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ప్రారంభమైన ఈ 2 కిలోమీటర్ల ర్యాలీ గీతాభవన్ చౌరస్తా మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు కొనసాగింది.
ఈ ర్యాలీలో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, నర్సింగ్, మెడికల్ కాలేజీల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గీతాభవన్ చౌరస్తాలో నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన వీధి నాటకం (నాటిక), అవగాహన గీతాలు ప్రజలను, తోటి విద్యార్థులను ఎంతగానో ఆలోచింపజేశాయి. ర్యాలీ అనంతరం కమిషనరేట్ కేంద్రంలోని ‘అస్త్ర కన్వెన్షన్ హాలు’లో సీపీ గౌష్ ఆలం అధ్యక్షతన విద్యార్థులతో భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ విడుదల చేసిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ప్రత్యేక షార్ట్ ఫిల్మ్‌ను విద్యార్థులకు ప్రదర్శించారు. అనంతరం చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ డ్రగ్స్ మహమ్మారి వల్ల యువత జీవితాలు ఎలా అంధకారంలోకి వెళ్తాయి, కుటుంబాలు ఎలా నాశనమవుతాయనే విషయాన్ని కళ్లకు కట్టింది. నర్సింగ్ విద్యార్థినులు తమ నృత్య ప్రదర్శన ద్వారా డ్రగ్స్ రహిత సమాజంపై చక్కని సందేశాన్ని ఇచ్చారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ.. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద మహమ్మారి మాదకద్రవ్యాల దుర్వినియోగం (డ్రగ్ అబ్యూస్) అని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు, యువత ఎలాంటి చెడు వ్యసనాలకు లోనుకాకూడదని హితవు పలికారు. చదువుల వల్ల కలిగే ఒత్తిడిని అధిగమించేందుకు డ్రగ్స్ వైపు కాకుండా, స్పోర్ట్స్, శారీరక వ్యాయామం (ఫిజికల్ యాక్టివిటీ) పై దృష్టి సారించాలని సూచించారు. జిల్లా (Karimnagar) ను డ్రగ్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. డ్రగ్స్ లేదా గంజాయి సేవించడం, విక్రయించడం ‘ఎన్.డి.పి.ఎస్ (NDPS) యాక్ట్ – సెక్షన్ 27’ ప్రకారం చట్ట రీత్యా తీవ్రమైన నేరమని, దీనివల్ల భవిష్యత్తు సర్వనాశనమవుతుందని సీపీ హెచ్చరించారు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్స్ వీక్ లో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు సిపి గౌష్ ఆలం చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
అనంతరం అధికారులు, విద్యార్థులందరూ కలిసి డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘సంతకాల సేకరణ బోర్డు’పై సీపీతో పాటు ఇతర అతిథులు, అధికారులు సంతకాలు చేసి, కరీంనగర్‌ను డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దుతామని సంకల్పించారు. ఈ సదస్సులో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి (DWO) సరస్వతి, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (DCPO) పర్వీన్, ఏసీపీలు వేణుగోపాల్, విజయకుమార్, యాదగిరిస్వామి, ఆంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ ఇతర పోలీస్, ఎక్సైజ్ అధికారులు, వివిధ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

