కలం, వెబ్ డెస్క్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు తెలంగాణ లోక్ భవన్ (Lok Bhavan) ఎదుట మంగళవారం నిరసన చేపట్టాయి. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
నీట్ వ్యవహారంలో ప్రాణాలు కోల్పోయిన 21 మంది విద్యార్థుల ఘటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని నిరసనకారులు నినాదాలు చేశారు. లోక్ భవన్ వైపు కవాతుగా వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురు విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కాగా, పోలీసుల తీరును విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఘటనపై ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

