రామచందర్ రావు వ్యాఖ్యలపై పొన్నం స్ట్రాంగ్ కౌంటర్

కలం, కరీంనగర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) విమర్శించారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచందర్ రావు ఎల్ నినో ప్రకృతి విపత్తు వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి, తెలంగాణ ప్రజల సహాయార్థం నిధులు తీసుకురావాలని మంత్రి డిమాండ్ చేశారు. చేతనైతే కేంద్రం నుంచి నిధులు సాధించి ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.

అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంట్‌లో సభ్యుడిగా లేకపోవడంతో అధికారిక వేదికలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం లేక, అసెంబ్లీ సమావేశాలకు ముందే అనవసర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ ప్రచారం పొందాలని రామచందర్ రావు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని, అక్కడ అన్ని పార్టీలకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఉంటుందని తెలిపారు. బీజేపీ తన వైఖరిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల ద్వారా సభలో తెలియజేయవచ్చని, ముందుగానే గందరగోళం సృష్టించడం సరికాదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. మెజారిటీ ఉందనే కారణంతో ప్రతిపక్షాల గొంతు నొక్కే సంస్కృతి తమ ప్రభుత్వానికి లేదన్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వం కీలక చట్టాలను సరైన చర్చ లేకుండానే తీసుకొచ్చిందని విమర్శిస్తూ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రతి అంశంపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ ఏ చట్టసభలోనూ సభ్యుడు కాకపోవడంతో సొంత పార్టీ నాయకుల నుంచే తగిన గుర్తింపు లభించక నిరాశతో రామచందర్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు అందించే కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజా సంక్షేమ దృష్టితో చూడాలని సూచించారు. ఇళ్ల నిర్మాణ పథకాలలో కేంద్ర నిధులు ఉన్నాయని చెబుతున్న బీజేపీ నాయకులు, నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. తెలంగాణకు వచ్చే కేంద్ర నిధులు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల రావడం లేదని, రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న పన్నుల్లో తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా మేరకే నిధులు విడుదల అవుతున్నాయని మంత్రి అన్నారు. ప్రజల హక్కులను ఉపకారాలుగా చూపించే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు అంగీకరించరని పేర్కొన్నారు. అనవసర విమర్శలు, రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి మరిన్ని నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>