కలం, వనపర్తి: ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) మంగళవారం వనపర్తి మండలం అంజనగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఆయన ఉపాధ్యాయుడిగా మారి, విద్యార్థులకు బోధించారు. విద్యార్థులు ప్రతిరోజూ పరిశుభ్రత పాటించాలని సూచించారు. శాకాహారం అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు మేధోశక్తి కూడా పెరుగుతుందని సూచించారు. కూరగాయలు, ఆకుకూరల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
“నేను చిన్నప్పుడు క్యారెట్ తినకపోవడం వల్లే కళ్లద్దాలు వచ్చాయి” అంటూ చమత్కరించి విద్యార్థులను నవ్వించారు. అనంతరం బ్లాక్‌బోర్డుపై నియోజకవర్గం, గ్రామాలు, రాష్ట్రాల పేర్లు రాసి విద్యార్థులను ప్రశ్నించారు. ఆసక్తిగా సమాధానాలు చెప్పడంతో పిల్లలను అభినందించారు. ఇక ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై గ్రామస్తులతో మాట్లాడిన నిరంజన్‌రెడ్డి, ప్రతి అర్హుడూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వామి కావాలన్నారు. మాజీ మంత్రి విద్యార్థులతో మమేకమై బోధించడం గ్రామస్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కె. మాణిక్యం, రఘువర్ధన్‌రెడ్డి, రవిప్రకాశ్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి, నాగవరం నరేశ్, డేగ మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము పాల్గొన్నారు.

