కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధం విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబుతాడన్న కక్షతో, పదో తరగతి చదువుతున్న బాలుడిని ఇద్దరు కలిసి పొట్టనబెట్టుకున్నారు. కూల్‌డ్రింక్‌లో కలుపు మందు (విషం) కలిపి తాగించడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకొరుకొండ (Chinna Korukondi) గ్రామంలో చోటుచేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలు:
చిన్నకొరుకొండ గ్రామానికి చెందిన రవి (15) పదో తరగతి చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన అపర్ణ భర్తతో విడిపోయి, ప్రస్తుతం గ్రామంలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నది. ఈ క్రమంలో అపర్ణకు అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఒకరోజు వీరిద్దరూ ఏకాంతంగా ఉండటాన్ని బాలుడు రవి చూశాడు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెబుతానని రవి హెచ్చరించాడు. తమ వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో అపర్ణ, అజయ్‌లు బాలుడిని అడ్డుతొలగించుకోవాలని కుట్ర పన్నారు.
పథకం ప్రకారం, గత నెల 24న రవిని ఊరి బయటకు తీసుకెళ్లిన నిందితులు.. కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి తాగించారు. ఆ తరువాత తీవ్ర అస్వస్థతకు గురైన రవిని కుటుంబ సభ్యులు వెంటనే గమనించి, మరుసటి రోజు (25న) ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు 20 రోజులకు పైగా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడినప్పటికీ, పరిస్థితి విషమించి చివరకు వరంగల్ ఎంజీఎం లో ఆదివారం రవి తుదిశ్వాస విడిచాడు.
పోలీసుల దర్యాప్తు.. అరెస్ట్:
బాలుడి మృతిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో అపర్ణ, అజయ్‌ల పాత్ర స్పష్టంగా వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు సోమవారం వారిని రిమాండ్‌కు తరలించింది.
అభం శుభం తెలియని పదో తరగతి బాలుడిని, తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో కిరాతకంగా హతమార్చిన ఈ ఘటన చిన్నకొరుకొండ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

