మణుగూరు ఓపెన్ కాస్ట్.. నిర్వాసితుల పరిహారానికి గ్రీన్ సిగ్నల్

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్టు (Manuguru Open Cast Project) కారణంగా మారుతున్న రూపురేఖల నేపథ్యంలో, స్థానిక నిర్వాసితులకు ఊరట లభించింది. మణుగూరు గ్రామానికి సంబంధించి నిర్వాసితుల పునరావాసం, పునరుద్ధరణ (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ కింద పరిహారం చెల్లింపునకు జిల్లా స్థాయి కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన ఐడీఓసీ కార్యాలయంలో మంగళవారం ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పీవో రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

​సమావేశంలో మణుగూరు గ్రామానికి చెందిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు, అర్హులైన కుటుంబాల గుర్తింపు అంశాలపై సమగ్రంగా చర్చించారు. అధికారుల సమర్పించిన వివరాలను పరిశీలించిన అనంతరం, మణుగూరు గ్రామానికి చెందిన 71 కుటుంబాలకు చెందిన గుర్తించిన 149 మంది లబ్ధిదారులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఒక్కొక్కరికి రూ.5.50 లక్షల చొప్పున మొత్తం రూ.8,19,50,000 (రూ.8.19 కోట్ల) ఆర్థిక సహాయం మంజూరు చేయడానికి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ​

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాస ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా న్యాయం చేయాలని తెలిపారు. భూసేకరణ, పరిహారం, పునరావాస అంశాల్లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

​పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఓపెన్ కాస్ట్ విస్తరణ వల్ల నష్టపోతున్న బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం సకాలంలో న్యాయం జరగాలని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ​ఈ సమావేశంలో సింగరేణి మణుగూరు జనరల్ మేనేజర్, భూసేకరణ అధికారి, మణుగూరు తహసీల్దార్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>