కలం, స్పోర్ట్స్: ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ (World Chess Championship 2026) టైటిల్ పోరుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుత ఛాంపియన్ డి. గుకేశ్ (Gukesh).. ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ జవోఖిర్ సిందరోవ్‌తో తలపడనున్నాడు. ఈ పోరులో సిందరోవ్‌కు స్వల్ప ఆధిక్యం ఉందని రష్యా గ్రాండ్‌మాస్టర్ పీటర్ స్విడ్లర్ అంచనా వేశారు. ఇద్దరి గెలుపు అవకాశాలను 55-45గా పేర్కొన్నారు. ఫిడేతో మాట్లాడిన స్విడ్లర్.. సిందరోవ్‌కు 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ అవకాశాలు ఇవ్వడం సరికాదన్నారు. గత ఏడాదిన్నర కాలంలో గుకేశ్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయినా.. అతడి అనుభవం, ఆటతీరును తక్కువ అంచనా వేయలేమని చెప్పారు.
ప్రపంచ ఛాంపియన్షిప్ మ్యాచ్ ప్రత్యేకమైన ఫార్మాట్లో జరుగుతుందని గుర్తుచేశారు. గుకేశ్, సిందరోవ్ మధ్య మ్యాచ్ నవంబర్ 24 నుంచి డిసెంబర్ 12 వరకు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరగనుంది. నవంబర్ 22న ప్రారంభోత్సవం ఉంటుంది. మొత్తం 14 క్లాసికల్ గేమ్స్ నిర్వహిస్తారు. ముందుగా 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు. 7-7తో స్కోరు సమమైతే టైబ్రేక్ ద్వారా ఛాంపియన్‌ను నిర్ణయిస్తారు. ఈ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి గుకేశ్, సిందరోవ్ ఇద్దరికీ 20 ఏళ్లే ఉంటాయి.
దీంతో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసు ఆటగాళ్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. 2024 డిసెంబర్లో చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌ను ఓడించిన గుకేశ్.. 18 ఏళ్ల ఆరు నెలల 24 రోజుల వయసులో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు తన టైటిల్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాడు. ఈ ఛాంపియన్షిప్ మొత్తం ప్రైజ్‌మనీ 25 లక్షల డాలర్లు.

