కలం, వెబ్ డెస్క్: ఇండియన్ సూపర్ లీగ్ (Indian Super League) నిర్వహణలో ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంది. ఇకపై లీగ్ కమర్షియల్ హక్కులను క్లబ్‌ల కమిటీయే స్వయంగా చూసుకోనుండగా, పరిపాలన, నిబంధనల పర్యవేక్షణ బాధ్యతలను మాత్రం ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) తన వద్దే ఉంచుకోనుంది. ఈ విషయాన్ని ఏఐఎఫ్ఎఫ్ ప్రతినిధులు, వివిధ క్లబ్‌ల సీఈఓలు బుధవారం జరిగిన ఒక సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, కొత్త జాతీయ క్రీడా గవర్నెన్స్ చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐఎఫ్ఎఫ్ డెప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం. సత్యనారాయణ తెలిపారు.
ఈ కొత్త విధానంలో భాగంగా త్వరలోనే బ్రాడ్‌కాస్ట్ భాగస్వామి, స్పాన్సర్‌షిప్‌ల కోసం క్లబ్‌ల మేనేజింగ్ కమిటీ టెండర్లు (RFP) పిలవనుంది. అలాగే వచ్చే 2026-27 సీజన్‌లో పాల్గొనే విషయమై 14 క్లబ్‌లకు ఏఐఎఫ్ఎఫ్ లేఖలు రాయనుంది. లీగ్ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కోసమే ఈ అడుగు వేసినట్లు నార్త్‌ఈస్ట్ యునైటెడ్ సీఈఓ మందార్ తమ్హానే వివరించారు.
వచ్చే సీజన్ నుండి పూర్తి స్థాయిలో హోమ్ అండ్ అవే పద్ధతిలోనే మ్యాచ్‌లు జరుగుతాయని ఎఫ్‌సి గోవా సీఈఓ రవి పుస్కుర్ చెప్పారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, మార్చి నెలల్లో వచ్చే ఫిఫా అంతర్జాతీయ విండోలతో పాటు, భారత జట్ల ఏఎఫ్సీ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా పరిగణనలోకి తీసుకుని ఐఎస్ఎల్ క్యాలెండర్‌ను రూపొందిస్తున్నారు. జాతీయ జట్టు కోసం ఆటగాళ్లను ఎక్కువ రోజులు విడుదల చేయాలని క్లబ్‌లను కోరినట్లు, అందుకు వారు సానుకూలంగా ఉన్నట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. స్పోర్టింగ్ క్లబ్ ఢిల్లీ సీఈఓ ధ్రువ్ సూద్ మాట్లాడుతూ లీగ్ ఖర్చులు తగ్గించడానికి ఏఐఎఫ్ఎఫ్, ప్రభుత్వం ఎంతో సహకరించాయని గుర్తుచేశారు.

