కలం, వెబ్ డెస్క్ : హోర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మరోసారి అంతర్జాతీయ ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఒమన్ సమీపంలో సింగపూర్‌కు చెందిన ‘ఎవర్ లవ్లీ’ అనే కార్గో నౌకపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. తమకు ఇష్టంలేని మార్గాల్లో ప్రయాణించే నౌకలకు భద్రత ఉండబోదంటూ ఇరాన్ హెచ్చరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. బ్రిటన్ మారిటైమ్ అధికారులు ఈ దాడి జరిగినట్లు ధృవీకరించగా, దీని వెనుక ఇరాన్ హస్తం ఉందంటూ ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ దాడిపై ఇరాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ ఆకస్మిక పరిణామంతో ఐక్యరాజ్యసమితి తీవ్ర అప్రమత్తమైంది. హోర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే నౌకల రక్షణ కోసం ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన ఎస్కార్ట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో చిక్కుకుపోయిన వందలాది నౌకలు, వేలాది మంది నావికుల భద్రతపై పునఃసమీక్ష జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ప్రపంచ ఆయిల్ సరఫరాలో కీలకమైన హోర్మూజ్ జలసంధిలో ఇలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం వల్ల ఇంధన సరఫరాకు అంతరాయం కలిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

