కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ (Telangana)లో ముగిసిన ‘సర్’ (SIR) ప్రక్రియతో దాదాపు 73 లక్షల మంది పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో డిలీట్ కానున్నాయి. పార్టీల ఓటు బ్యాంకు గల్లంతవుతుందనే ఆందోళన ఎలా ఉన్నా రాజకీయ నాయకుల్లో మాత్రం మరో రకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ల సంఖ్య తగ్గడంతో ఆ మేరకు ఖర్చుకూడా తగ్గుతుందన్నది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆశావహుల అభిప్రాయం. అన్ని పార్టీల నేతల మాటలూ ఇదే తీరులో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేతల్లో ఈ మాటలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.
రాష్ట్రం మొత్తం మీద 73 లక్షలకు పైగా పేర్లు గల్లంతుకాగా అందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ఓటర్లే 43 లక్షలకు పైగా ఉన్నారు. ఇంతమంది పేర్లు మిస్ కావడంతో తుది జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నా భారీ స్థాయిలూ లెక్కల్లోకి రాని ఎన్నికల ఖర్చు తగ్గుతుందన్నది లీడర్ల అభిప్రాయం. హైదరాబాద్ సిటీలో, చుట్టూ ఉండే దాదాపు పాతిక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖర్చు తగ్గే అవకాశం ఉందని లెక్కలేసుకుంటున్నారు.
‘సర్’తో ఓటర్ లిస్టు తగ్గడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒకింత రిలీఫ్ అవుతున్నారు. ‘హమ్మయ్యా.. ఎన్నికల ఖర్చు తగ్గుతుంది’ అని భావిస్తున్నారు. ఇంతకుముందు ఎంత మంది ఓటర్లకు ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చేది? ఇప్పుడు ఓటర్లు తగ్గడంతో ఎంత ఖర్చు తగ్గుతుందని కూడికలు తీసివేతలు మొదలుపెట్టారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఈ సీన్ కనిపిస్తున్నది. రాష్ట్రంలో ‘సర్’ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈ నెల 10తో ముగిసింది. 73 లక్షల మంది వరకు ఓటర్లు వివరాలు అందించలేదని తేలింది. వీరు డ్రాఫ్ట్ ఓటరు లిస్టులో ఉండే అవకాశం లేదు. అందులో దాదాపు 60శాతం మంది గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల వారే. దీంతో ఆయా ఏరియాల్లోని పార్టీల లీడర్లు ఎన్నికల ఖర్చు తగ్గుతుందని అంచనా వేసుకుంటున్నారు.
ఈసీకి చిక్కకుండా ఖర్చు చేస్తూ..!
కేంద్ర ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఏ ఎన్నికలైనా, ఎంతమంది అబ్జర్వర్లను దించినా కంటికి కనిపించకుండా పార్టీల అభ్యర్థులు పెట్టే ఖర్చు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుపై కమిషన్ స్పష్టమైన నిబంధనలనే పెట్టింది. టీ, కాఫీ కోసం చేసే ఖర్చు మొదలు వాహనాల పెట్రోల్/డీజిల్, మైక్ సెట్, బహిరంగసభల్లో కుర్చీలు, డయాస్ ఖర్చు… వీటికి నిర్దిష్టమైన లెక్కలు చూపాలని చెప్పింది. అభ్యర్థులు పెట్టే ఖర్చులో వీటిని కలపాలన్నది ఆ నిబంధనల ఉద్దేశం.
పోలింగ్ ముగిసే నాటికి అభ్యర్థులు వారు పెట్టిన ఖర్చు గరిష్ట పరిమితికి లోబడి ఉన్నట్లుగానే ఎలక్షన్ కమిషన్‌కు అఫిడవిట్ ఇస్తారు. కానీ, కంటికి కనిపించకుండా అవుతున్న ఖర్చు మాత్రం ఈ లెక్కల్లో చేరడంలేదు. ఉదాహరణకు చాలా గ్రామాల్లో “ఆ వీధిలో వారికి ఎక్కువ ఇచ్చి మాకు తక్కువ ఇచ్చారు..’’ అంటూ రోడ్డెక్కి నిరసన చేసిన సందర్భాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటివి బహిరంగంగానే కనిపిస్తున్నాయి. ఈ ఖర్చులన్నీ లెక్కల్లోకి రాకుండా లీడర్లు దాచేస్తున్నారు.
ఎవరి లెక్కల్లోకి రాని డబ్బు అది!
– ఓటర్ల సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే అభ్యర్థులకు ఖర్చు అంత ఎక్కువ అవుతుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటల వ్యవధిలోనే ఈ ఖర్చంతా రహస్యంగా జరిగిపోతుంది.
– ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి, అనుకూలంగా ఓటు వేయడానికి వివిధ పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ఒక్కో ఓటుకు రేటు కట్టే సీక్రెట్ మెకానిజం అమలవుతుందన్నది బహిరంగ రహస్యం.
– పచ్చ నోట్లు, బీరు, బిర్యానీ, గిఫ్ట్ ప్యాక్‌లు.. ఇలాంటివన్నీ లెక్కల్లోకి రాని ఖర్చుగా ఉంటాయన్నది ఎలక్షన్ వాచ్ లాంటి సంస్థలు తరచూ ఎలక్షన్ కమిషన్‌కు లేఖలు రాస్తూ ఉంటాయి.
– అన్ని పార్టీలూ అమలు చేస్తున్న విధానమే కావడంతో ‘డార్క్ సైడ్ ఆఫ్ ది డెమోక్రసీ’ అనే తీరుగా మారిపోయిందన్న ఆరోపణలూ ఉన్నాయి.
– ఎలక్షన్ కమిషన్ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ తరచూ రోడ్ల మీద తనిఖీలు చేస్తూ కోట్లాది రూపాయల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకుంటూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఈ నగదు ఎవరికీ చెందనిదిగానే ఉండిపోతున్నది.
– ఎవరి లెక్కల్లోకి రాని ఇలాంటి డబ్బే క్యాంపెయిన్ ముగిసిన తర్వాత ఉండే ‘సైలెన్స్ పీరియడ్’లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి వినియోగిస్తున్నారన్న బహిరంగ ఆరోపణలకు కారణమవుతున్నది.
ఓటర్లు తగ్గడంతో ఖర్చు తగ్గుతుందనీ..!
తాజాగా ముగిసిన ‘సర్’ ప్రక్రియలో దాదాపు 73 లక్షల మంది పేర్లు డ్రాఫ్ట్ లిస్టు నుంచి డిలీట్ కానుడటంతో గ్రీవెన్స్ తర్వాత ఎన్ని అదనంగా చేరతాయి, నోటీసులు అందుకున్న వారి నుంచి తగిన ఆధారాలు లేకపోతే ఎన్ని ఇంకా డిలీట్ అవుతాయన్నది అక్టోబర్‌లో స్పష్టం కానున్నది. డిలీట్ అయిన పేర్లు ఎన్ని ఎక్కువ ఉంటే ‘సైలెన్స్ పీరియడ్’ అభ్యర్థిగా పెట్టాల్సిన సీక్రెట్ ఖర్చు అంత తక్కువవుతుందని ఆశావహుల అంచనా. నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య, అక్కడ ప్రత్యర్థి నుంచి ఉండే పోటీకి తగ్గట్టు పోటీచేసే పార్టీల క్యాండిడేట్ల ఖర్చు పెరుగుతున్నది.
ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఎలా ఉన్నా అబ్జర్వర్లకు తెలియకుండా జరుగుతున్న నోట్ల పంపిణీ అభ్యర్థులకు గుదిబండగానే ఉన్నది. ఇప్పుడు ఓటర్ల సంఖ్య తగ్గితే ఆ మేరకు రిలీఫ్ దొరుకుతుందని భావిస్తున్నారు. భారీ సంఖ్యలో పేర్లు తగ్గిపోవడంపై పార్టీల నాయకత్వానికి మాత్రం ఒకింత ఇబ్బందికరంగా మారింది. డిలీట్ అయిన ఓటర్లలో అనుకూలమైనవారు ఎంతమంది అనేది తేలే వరకు గుబులు కొనసాగే అవకాశం ఉంది.

