కలం, నిర్మల్: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తుండగా.. నిర్మల్ జిల్లాలో మాత్రం పార్టీలో (Nirmal BJP) అంతర్గత కుమ్ములాటలు నెలకొన్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రితీష్ రాథోడ్ నియామకమై ఏడాదిన్నర పూర్తవుతోంది. ఇప్పటివరకు జిల్లా పదాధికారులు, సీనియర్ నేతలు, మండలాధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలతో సమగ్ర జిల్లా స్థాయి సమావేశం నిర్వహించలేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జిల్లాలో పార్టీని నడిపించే తీరు, నేతల మధ్య సమన్వయం లోపం ఎదుగుదలకు శాపంగా మారింది.
జిల్లా కేంద్రానికి పరిమితం
జిల్లాలోని ఉట్నూరుకు చెందిన రితీష్ రాథోడ్ కు అధ్యక్ష పదవి ఇవ్వడంతో అప్పట్లోనే కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా.. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ ఒప్పుకున్నారు. అధ్యక్షుడి పనితీరుపై కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను జిల్లా కేంద్రంలో చేయడానికే పరిమితమయ్యారు. జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశాలు, మండలాల్లో పార్టీ పరిస్థితిపై చర్చలు, కార్యకర్తల సమస్యలపై ఆరా, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన కార్యాచరణ వంటివి పెద్దగా లేవనే చర్చ కేడర్ లో జరుగుతోంది.
అధిష్టానం ఆరా తీసేదెప్పుడు?
పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసిన కొందరు సీనియర్ నేతలు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. నేతల మధ్య సమన్వయం పెంచి, సీనియర్లు, యువత, క్షేత్రస్థాయి కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన జిల్లా అధ్యక్షుడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికైనా సీనియర్లు పార్టీకి ఎందుకు దూరమవుతున్నారు? కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? జిల్లా నాయకత్వంలో సమన్వయం ఎందుకు కొరవడుతోంది? అనే అంశాలపై రాష్ట్ర అధిష్టానం దృష్టి సారించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
ఎమ్మెల్యేలు ఉన్నా.. గోడు వినేవారేరీ?
నిర్మల్, ముథోల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీ కోసం శ్రమించిన గ్రామస్థాయి నేతలు, కార్యకర్తలు తమ సమస్యలను చెప్పుకునేందుకు సరైన వేదిక లేక ఇబ్బందులు పడుతున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఫలితాలు సాధించినా కానీ.. ఆ ఊపును క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం లేదని నేతలు, కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది. పార్టీలో సమన్వయం లోపిస్తే, అది భవిష్యత్తులో ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్రస్థాయి సమీక్ష ఎప్పుడు?
జిల్లా అధ్యక్షుడి పనితీరుపై అసంతృప్తి స్వరాల వినిపిస్తుండగా రాష్ట్ర నాయకత్వం ఇకనైనా స్పందించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జిల్లా పదాధికారులు, సీనియర్ నేతలు, మండల అధ్యక్షులు, బూత్ స్థాయి కార్యకర్తలతో విస్తృత సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పరిస్థితిపై సమగ్ర సమీక్ష చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. నేతలను సమన్వయం చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పేర్కొంటున్నారు. అయితే జిల్లా బీజేపీలో ప్రస్తుతం నెలకొన్న అసంతృప్తి జ్వాలలను అధిష్టానం ఎలా చల్లార్చుతుందా.? లేదా అనేదిందుకు వేచి చూడాలి.
సీనియర్లను విస్మరిస్తే..
పార్టీలో సీనియర్ నేతలను పట్టించుకోకుండా ముందుకు సాగితే.. రాబోయే రోజుల్లో పలువురు నేతలు ప్రాంతీయ పార్టీల వైపు వెళ్లే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పటికైనా సీనియర్లను సమన్వయం చేసుకొని అధిష్ఠానం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ల అనుభవం, కార్యకర్తల బలం, యువత ఉత్సాహాన్ని సమన్వయం చేస్తేనే ఎన్నికల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

