రైలు ప్రయాణాలతో చైన్ స్నాచింగ్‌లు.. నేరస్థుడి అరెస్ట్

కలం, ​పెద్దపల్లి: ఉత్తరప్రదేశ్ నుంచి రైలులో వచ్చి పెద్దపల్లి, రామగుండం ప్రాంతాల్లో వరుస చైన్ స్నాచింగ్‌లు, ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరస్థుడిని రామగుండం పోలీసులు (Ramagundam Police) అరెస్ట్ చేశారు. ఖాన్‌పూర్ కాల (ఉత్తరప్రదేశ్)కు చెందిన భవారియా తెగకు చెందిన నిందితుడు కలిరామ్ (38)ను అదుపులోకి తీసుకోగా, అతని వద్ద నుండి దొంగిలించిన ఒక పల్సర్ ద్విచక్ర వాహనాన్ని (TS02FG3079) స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు ఉన్న మరో వ్యక్తి కపిల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

నేర విధానం (మోడస్ అపెరాండీ)..

గతంలో పాల వ్యాపారం చేసిన కలిరామ్, జల్సాలకు అలవాటుపడి తన స్నేహితుడు కపిల్‌తో కలిసి దొంగతనాలు ప్రారంభించాడు. వీరు ఉత్తరప్రదేశ్ నుండి రైలులో పెద్దపల్లికి చేరుకుని, రాత్రి వేళల్లో ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించేవారు. ఆపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులు, పుస్తెలతాళ్లను లాక్కొని పారిపోయేవారు. దొంగిలించిన వాహనాలను బెల్లంపల్లి, బల్హర్ష లేదా వాంకిడి సమీపంలో వదిలేసి తిరిగి రైలులోనే సొంత రాష్ట్రానికి వెళ్లిపోయేవారు.

చోటుచేసుకున్న ప్రధాన సంఘటనలు..

​మార్చి 30, 2026న పెద్దపల్లి రైల్వే కాలనీలో పల్సర్ బైక్‌ను దొంగిలించి, బంధంపల్లి వద్ద గుండు నర్సమ్మ నుండి 2 తులాల పుస్తెలతాడు, రామగుండం ఓల్డ్ బజార్‌లో కోల కుసుమ నుండి 45 గ్రాముల పుస్తెలతాడు లాక్కొని పరారయ్యారు. ​ మే 29, 2026న పెద్దపల్లి బస్ స్టాండ్ వద్ద మరో పల్సర్ బైక్ దొంగిలించారు. ​ఆగస్టు 17, 2026: కాలేజీ మైదానం వద్ద పల్సర్ బైక్ దొంగిలించి, లక్ష్మీనగర్‌లో నూనె స్వరూప నుండి 30 గ్రాముల పుస్తెలతాడును స్నాచింగ్ చేశారు.

నిందితుడి పట్టుబడిన తీరు..

వరుస నేరాలపై రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా, డీసీపీ బి. రామ్ రెడ్డి, ఏసీపీ జి. కృష్ణల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన భవారియా తెగగా గుర్తించారు. గతంలో బెల్లంపల్లి వద్ద దాచిన బైక్ కోసం పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చిన కలిరామ్‌ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. స్నాచింగ్ చేసిన సొత్తు పరారీలో ఉన్న కపిల్ వద్ద ఉందని డీసీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ కె. ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐలు కె. నరేష్, ఎం.డి. నసీర్, హెచ్‌సీ సుధాకర్, పిసిలు ప్రభాకర్, విజయ్ కుమార్, ప్రేమ్ సాగర్‌లను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>