కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు నిర్మించిన బైపాస్ రహదారి (Jagtial Bypass Road)పై ఇప్పుడు ప్రమాదాల నీడ అలుముకుంది. పట్టణంలో హెవీ వెహికల్స్ రాకపోకల వల్ల కలిగే ఇబ్బందులను నివారించేందుకు జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామం నుంచి చెల్గల్ వరకు ఈ బైపాస్ రోడ్డును అందుబాటులోకి తెచ్చారు. కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే భారీ వాహనాలు ఈ మార్గం మీదుగానే ప్రయాణిస్తుంటాయి.
మలుపు వద్దే పార్కింగ్.. పెరిగిన ప్రమాదాలు
రహదారి మలుపుల వద్ద టిప్పర్లు, లారీలు పెద్ద సంఖ్యలో నిలిపివేస్తుండటంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారి నుంచి బైపాస్‌లోకి ప్రవేశించే తిరుగుడు మలుపు వద్దే లారీలను నిలపడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో ఈ సమస్య మరీ దారుణంగా తయారవుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంతల మయం.. ప్రాణసంకటం
మరోవైపు ధరూర్ ఎస్.ఆర్.ఎస్.పి కెనాల్ వంతెనకు ధరూర్, టీఆర్ నగర్ వైపు ఉన్న జగిత్యాల–కరీంనగర్ రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతలను తప్పించుకునే క్రమంలో వాహనదారులు అటూ ఇటూ వెళ్లాల్సి రావడం, అదే సమయంలో మలుపు వద్ద లారీలు పార్క్ చేసి ఉండటంతో వాహనాలు ఢీకొంటున్నాయి. మంగళవారం రోజున కరీంనగర్‌కు చెందిన ఓ బైకిస్టును టిప్పర్ ఢీకొట్టడంతో అతడు వెనక టైరు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
అధికారులు తక్షణమే స్పందించాలి
బైపాస్ మలుపు వద్ద భారీ వాహనాల నిలిపివేతను వెంటనే నిషేధించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను తక్షణమే పూడ్చివేసి రహదారి రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

