కలం, కరీంనగర్ : తెలంగాణ నేర పరిశోధన విభాగం (CID), స్థానిక పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్ బాండ్లు, రసీదుల పరిశీలన (Agrigold Bond Verification) ప్రక్రియ బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. కరీంనగర్‌లోని సిటీ ట్రైనింగ్ సెంటర్ (CTC)లో ఈ ప్రత్యేక వెరిఫికేషన్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
డిపాజిటర్లకు ముఖ్య సూచనలు
బాండ్ల పరిశీలన పని దినాల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. రద్దీని నివారించేందుకు డిపాజిటర్లు పోలీసు శాఖ కేటాయించిన మండలాల వారీ తేదీల ప్రకారమే హాజరుకావాలని అధికారులు సూచించారు. వెరిఫికేషన్‌కు హాజరయ్యే బాధితులు తమ ఒరిజినల్ అగ్రిగోల్డ్ బాండ్లు లేదా రసీదులతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ తీసుకురావాలి.
డిపాజిటర్ మరణించినట్లయితే, వారి వారసులు మరణ ధృవీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పాటు తమ గుర్తింపు కార్డులను సమర్పించాలి. ఒరిజినల్ బాండ్లను కేవలం పరిశీలన నిమిత్తమే చూపించాలని, వెరిఫికేషన్ అనంతరం వాటిని తిరిగి డిపాజిటర్లకే అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. జిరాక్స్ కాపీలు సమర్పించిన తర్వాత అధికారిక రసీదు (అక్నాలెడ్జ్మెంట్) అందజేస్తారు. కరీంనగర్‌తో పాటు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి తదితర జిల్లాల పరిధిలోని అర్హులైన అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లు తమకు కేటాయించిన తేదీల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

