కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఎప్పుడు మొదలు పెడతారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో పట్టుబట్టి మంజూరు చేయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్పత్రిని ప్రారంభించడంలో జాప్యం చేస్తోందని ఫైర్ అయ్యారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పరిశీలించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే మొట్టమొదటి మెడికల్ కాలేజీని, వెయ్యి పడకల ఆస్పత్రిని తీసుకువచ్చామని చెప్పారు. జిల్లాలోని పేద ప్రజలు క్యాన్సర్, గుండె, కాలేయ సమస్యల బారిన పడుతున్నట్లు గుర్తించి బస్టాండ్‌లో దిగిన వెంటనే వైద్యం అందెలా హాస్పిటల్ నిర్మించామన్నారు. భవనం పూర్తయి కలర్స్ వేసే వరకు పనులు బీఆర్ఎస్ పాలనలోనే పనులు జరిగాయన్నారు. ఎలక్షన్ సెల్ వల్ల ఒక విభాగం ఆలస్యం అయిందనీ చెప్పుకొచ్చారు. రూ. 500 కోట్లతో వైద్యపరికరాలు కొనాల్సి ఉందన్నారు. జూన్ 2 ప్రారంభిస్తామని సంబంధిత మంత్రి సైతం చెప్పిన ప్రారంభోత్సవం జరగలేదన్నారు.
పర్యాటక రంగం నిర్వీర్యం
మంత్రిగా అయినా తరువాత సోమశిలను అన్ని హంగులతో అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రాజెక్టుల సందర్శనకు వచ్చి అక్కడే బస చేస్తున్నారని ఆయన తెలిపారు. సోమశిలతోపాటు ఈగలపెంట, మన్ననూరు, జోగులాంబ వద్ద టూరిజం శాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా సౌకర్యాలు అభివృద్ధి చేశామన్నారు. హాస్పిటల్ పక్కన టూరిజం ప్లాజా పెడితే రోగులకు వసతి సౌకర్యం కల్పించవచ్చని అనుకున్నాం. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసిందని విమర్శించారు. 2023 ఎ న్నికల సమయంలో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని పేర్కొన్నారు.
రోప్ వే పనులు ఎందుకు నిలిపేశారు?
మన్యంకొండ రోప్‌వే పనులు పనులు కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని.. ఇదంతా కక్ష పూరితంగా చేస్తున్నారని ఆరోపించారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ వద్ద రోప్ వే చేస్తే భక్తుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. కులవృత్తుల కోసం శిల్పరామం నిర్మాణం చేస్తే దాన్ని మూసేశారని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌లో నెక్లెస్ రోడ్డు.. ఉమెన్స్ పార్క్.. ఫుడ్ కోర్టు.. సీనియర్ సిటిజెన్ ట్రాక్, సైకిల్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, మ్యూజికల్ నైట్ ఏర్పాటుకు అవసరమైన వసతులు తమ ప్రభుత్వంలో కల్పిస్తే ప్రస్తుతం అవన్నీ ఎందుకూ పనికిరాకుండా తయారు చేశారని ఫైర్ అయ్యారు. ఐలాండ్ వెళ్లేందుకు బ్రిడ్జ్ పూర్తిచేస్తే ట్యాంక్ బండ్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని సోయి కూడా ప్రస్తుత ప్రభుత్వానికి లేదన్నారు. మాజీ మంత్రి వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గాడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మహబూబ్‌నగర్ మండల అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

