Mobile Popup Ad
Mobile Popup Ad

పవన్ కల్యాణ్‌తో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ : జగదీశ్ రెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి.. పవన్ కల్యాణ్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ అస్థిత్వాన్ని అవహేళన చేసిన ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్‌ ఒక్కటేనని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. దీని కోసమే రేవంత్ రెడ్డి నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారని.. ఆయనను తెలంగాణలోకి రాకుండా ఎవరు అడ్డుకున్నారో చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఎవరు అడ్డుకున్నారు..? ఎవరు ఏమన్నారు..?

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు శూన్యంలో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయని, ఆయన ఇకనైనా సినిమా డైలాగులు కొట్టడం మానుకోవాలని హితవు పలికారు. “ఎవరు అడ్డుకున్నారు..? ఎవరు ఏమన్నారు..? అనే విషయాలపై కనీసం పేర్లు కూడా చెప్పకుండా గాల్లో మాట్లాడటం సరికాదు” అని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలతో ఎదిగిన వారు, ఇదే గడ్డపై ఉండి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని, ఆస్తులు కూడబెట్టుకున్న వారు.. ఈరోజు తెలంగాణను తక్కువ చేసి మాట్లాడటం తగదని హితవు పలికారు. ప్రస్తుతం తెలంగాణలో అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇటువంటి రాజకీయ డ్రామాలు నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు.

మోదీ ఏజెంట్‌లా పవన్..

పవన్ కల్యాణ్ తీరుపై జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చదువుతున్నట్టుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం మోదీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని, గతంలో పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటును అవహేళన చేసిన వారితో కలిసి ఆయన మాట్లాడటం నిజంగా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తెలంగాణలో పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లను ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. “మళ్లీ వస్తా.. పొడుస్తా.. అంటూ పవన్ చెప్పే మాటలను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు” అని స్పష్టం చేశారు. తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు పవన్ కల్యాణ్ జాగ్రత్తగా మాట్లాడాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా ఇక్కడి ప్రజలు ఎంతమాత్రం సహించరని హెచ్చరించారు.

Read Also: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి సేవలో ప్రముఖులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>