కలం, వెబ్ డెస్క్: గతకొద్ది రోజులుగా తెలంగాణలో వర్షాలు (Telangana Rains) దంచికొడుతున్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారీ వర్షానికి రాజధాని నగరం హైదరాబాద్ తడిసిముద్దయింది. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమై య్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాలకు నగరవాసులు ఇబ్బందులు పడుతున్నా.. సిటీలోని చెరువులు, కుంటలు, ఉస్మాన్ సాగర్, గండిపేట జలాశయాల్లోకి నీరు వచ్చి చేరుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం..
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, మణికొండ, బేగంపేట, ప్యాట్నీ, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, కొండాపూర్, కొత్తగూడ, చందానగర్, పంజాగుట్ట, బాలానగర్, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
హైడ్రా అలర్ట్..
భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురవడంతో హైడ్రా బృందాలు అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగించాయి. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో డీఆర్ఎఫ్, ఎంఆర్టీ బృందాలను మోహరించి, భారీ సామర్థ్యపు పంపులతో రోడ్లపై నీరు నిలిచిన నీరును తొలగించాయి. ఈ మేరకు నీటిమునిగిన రోడ్లపై నీటిని తొలగించి, సాధారణ పరిస్థితులు పునరుద్ధరించే చర్యలు చేపట్టినట్లు హైడ్రా వెల్లడించింది.
దంచికొట్టిన వాన..
ఇక కామారెడ్డి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, గద్వాల్, వనపర్తి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం, మహబూబాబాద్, భూపాలపల్లిలో 100-180 మిల్లీ మీటర్ల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రాత్రి కురిసిన భారీ వర్షాలకు పిట్లం-తిమ్మా నగర్, అచ్చంపేట–నిజాంసాగర్ సహా పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల వరప్రదాయినిగా ఉన్న పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెకులలోకి వరదనీరు రావడంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.
ఈ జిల్లాల్లో వర్షాలు..
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, హనుమకొండ, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు సోమవారం సరూర్ నగర్ లో అత్యధికంగా 112 MM వర్షం కురిసింది. ఉప్పల్ ప్రాంతంలో 81.3 MM, బండ్లగూడ 79.5 హయత్ నగర్ 72.5 శాతం వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

