కలం, ఖమ్మం బ్యూరో : వేగంగా విస్తరిస్తున్న ఖమ్మం నగర మకుటంలో మరో ఆధ్యాత్మిక రత్నం చేరింది. ప్రాంతీయ అభివృద్ధికి తోడు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటూ, ధర్మపరిరక్షణకు కేంద్ర బిందువుగా నిలిచేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ (Sri Venkateswara Swamy Temple) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఖమ్మం నగరంలోని కొత్తగూడెం- అల్లిపురం(Allipuram) సోమవారం వేద మంత్రోచ్ఛారణలు, హోమాల మధ్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుతో కలిసి ఆలయ భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర ఘట్టంతో ఖమ్మం నగరానికి కొత్త ఆధ్యాత్మిక మెరుపు చేరింది.
ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ, రెండు రాష్ట్రాలకు వారధిగా ఉన్న ఖమ్మం ప్రాంతంలో శ్రీవారి ఆలయం రూపుదిద్దుకోవడం ఎంతో శుభపరిణామమని అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు ఖమ్మం నేలపై అడుగుపెట్టడం దైవసంకల్పమని పేర్కొన్నారు. ఆలయాలు కేవలం పూజా పునస్కారాలకే పరిమితం కాకుండా కులమతాలకు అతీతంగా ధర్మాన్ని, వసుధైక కుటుంబ భావనను, మానవతా విలువలను పెంపొందించే కేంద్రాలుగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ శ్రీవారి ఆలయ నిర్మాణంలో భాగస్వాములై తమ వంతు సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఖమ్మంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరగడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. భద్రాచలం పుణ్యక్షేత్ర అభివృద్ధి పనులతో పాటు ఖమ్మంలో శ్రీవారి ఆలయ శంకుస్థాపన జరగడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, త్వరలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు మాట్లాడుతూ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషి వల్లే ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణం సాధ్యమైందని కొనియాడారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంలో భాగంగా రాబోయే ఏడాది కాలంలో 5,000 ఆలయాలను నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ఖమ్మంలో సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని కేటాయించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా ఆలయ నిర్మాణానికి పలువురు ప్రముఖులు స్వచ్ఛందంగా భారీ విరాళాలు ప్రకటించారు. ఎంపీ పార్థసారథి రెడ్డి రూ.60 లక్షలు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రూ.50 లక్షలు, ఎమ్మెల్సీ తాతా మధు రూ.25 లక్షలు, అలాగే భోజన ఏర్పాట్లు చేసిన దాత రూ.11 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., సీపీ సునీల్ దత్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల అధికారులు, టీటీడీ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

