ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. తప్పిన పెను ప్రమాదం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ (Alugunur) లో అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. అతివేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కరీంనగర్ – జగిత్యాల ప్రధాన రహదారిపై వెళ్తున్న లారీ అలుగునూర్ శివారులోకి రాగానే అదుపుతప్పింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. లారీ నేరుగా రోడ్డు పక్కన ఉన్న ఇంటి గోడను ఢీకొట్టింది. దీంతో ఇంటి ముందు భాగం, ఒక గది పూర్తిగా కూలిపోయింది. ఇంట్లోని సామాన్లు ధ్వంసం అయ్యాయి.

పెద్ద శబ్దంతో ఉలిక్కిపడ్డ గ్రామస్తులు..

పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కిపడి బయటకు వచ్చారు. ఇంట్లో నిద్రిస్తున్న భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు శిథిలాల మధ్య నుంచి బయటకు వచ్చారు. వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీని వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

గ్రామస్తుల ఆగ్రహం

అలుగునూర్ ప్రధాన రహదారిపై భారీ వాహనాలు అతివేగంగా నడుపుతున్నారని, ఇదే రోడ్డుపై నెల రోజుల్లో ఇది రెండో ప్రమాదమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇల్లు రోడ్డుకు ఆనుకుని ఉండడం, ప్రమాదం తెల్లవారుజామున జరగడం వల్ల పెద్ద ప్రాణ నష్టం తప్పింది. ఒకవేళ పగటిపూట జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని స్థానికులు అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>