కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకే రుణాలు మాఫీ చేస్తూ పెట్టుబడిదారులకు ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat Reddy) ధ్వజమెత్తారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్లకు చెందిన రూ. 22 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం, పేదలు, రైతులు తీసుకున్న రుణాలను మాత్రం మాఫీ చేయడం లేదని మండిపడ్డారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీనే శాశ్వత పరిష్కారం..
తెలంగాణ ప్రాంతానికి గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారానే అందుతాయని చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ‘జలయజ్ఞం’ కార్యక్రమానికి సీపీఐ సంపూర్ణ మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే ఆదిలాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సాగు, తాగునీటి సమస్య శాశ్వతంగా తీరుతుందన్నారు. కేంద్రం, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నందున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి బ్యారేజీ నిర్మాణానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ధరణి కారణంగానే భూ సమస్యలు..
2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌లో అనేక లోపాలు ఉన్నాయని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఆ విషయాన్ని అప్పుడే కేసీఆర్‌కు చెప్పినా పెడచెవిన పెట్టారని విమర్శించారు. దీంతో 22ఏ నిషేధి భూముల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా మల్కాజ్‌గిరి వంటి ప్రాంతాల్లో అనేక భూసమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిషేధిత, వ్యవసాయ భూములను కూడా వదలకుండా దందాలు చేస్తున్నారని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రూ.వందల కోట్ల అక్రమాస్తులతో..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నా.. అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం లోపించిందని చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. రెవెన్యూ, ఇంజినీరింగ్, పోలీస్ శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని.. ఏసీబీ దాడుల్లో రూ.వందల కోట్లతో దొరకడమే నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి.. రాజకీయ విశ్లేషకులు, రిటైర్డ్ అధికారులతో సంప్రదింపులు జరిపి పరిపాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలని సూచించారు.
కరీంనగర్‌లో ఏఐటీయూసీ సభలు..
సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి 8 వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జరుపుతున్నట్లు చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. కార్మిక లోకం తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, టేకుమల్ల సమ్మయ్య, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, న్యాలపట్ల రాజు, కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, మచ్చ రమేష్, నాయకులు బాకం ఆంజనేయులు పాల్గొన్నారు.

