కలం, వెబ్ డెస్క్: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) రేపు (బుధవారం) కీలకతీర్పు వెలువరించనున్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి (Kadiyam Srihari) మీద నమోదైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. వీరి మీద అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేందర్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై రేపు తుది తీర్పు వెలువడనున్నది.
తమ పార్టీ నుంచి మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించినట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలలాగేనే వీరిద్దరికీ కూడా క్లీన్ చిట్ ఇస్తారా? లేదా? అన్నది రేపు తేలనున్నది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), ఆరేకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), కాలే యాదయ్య (చేవెళ్ల), సంజయ్ కుమార్ (జగిత్యాల) పార్టీ మారినట్టుగా సరైన ఆధారాలు లేవని స్పీకర్ అనర్హత పిటిషన్లు కొట్టేశారు. దీంతో బుధవారం ఇవ్వబోయే తీర్పుపై ఆసక్తి నెలకొన్నది. దానం నాగేందర్ (Danam Nagender) పార్టీ మారినట్టు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ చెబుతోంది. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించామని అంటున్నది. కడియం శ్రీహరి (Kadiyam Srihari) కూతురు కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి పోటీ చేశారని.. ఆయన ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారని అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ చెబుతోంది. దీంతో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొన్నది.
Read Also: ఆర్బీఐ అప్పుల్లో థర్డ్ ప్లేస్.. తొమ్మిది నెలల్లో రూ. 69 వేల కోట్లు
Follow Us On : WhatsApp

