Mobile Popup Ad
Mobile Popup Ad

లొంగిపోయిన మావోయిస్టులకు రూ.55.6 లక్షల పునరావాస సాయం అందజేత

కలం, ఖమ్మం బ్యూరో: ఆయుధాలు విడిచి.. అడవి బాట వీడి.. సమాజంలో గౌరవంగా బతకాలనే ఆశయంతో జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం, జిల్లా పోలీస్ శాఖ అండగా నిలిచింది. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన 10 మంది వివిధ క్యాడర్ల మావోయిస్టు సభ్యులకు ప్రభుత్వం తరఫున రూ.55.6 లక్షల పునరావాస రివార్డు సొమ్ము మంజూరైంది. ఈ సొమ్మును భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohith Raj) శనివారం తన చేతుల మీదుగా చెక్కుల రూపంలో అందజేశారు.

లొంగిపోయిన వారికి ప్రభుత్వ ఫలాలు త్వరగా అందాలనే ఉద్దేశంతో ఎస్పీ రోహిత్ రాజ్ ప్రత్యేక చొరవ తీసుకొని, వారి క్యాడర్ ఆధారంగా మంజూరైన ఈ భారీ మొత్తాన్ని అత్యంత వేగంగా వారికి చేర్చారు. లొంగిపోయిన సభ్యుల్లో ​స్టేట్ కమిటీ మెంబర్, ​డివిజనల్ కమిటీ మెంబర్,​ ఏరియా కమిటీ మెంబర్స్, ​దళ సభ్యులు వంటి కీలక నేతలు ఉండటం గమనార్హం. రివార్డులు అందుకున్న వారిని ఎస్పీ రోహిత్ రాజ్ ఆప్యాయంగా పలకరించి, ప్రస్తుతం వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి దిశా నిర్దేశం చేస్తూ ​ప్రభుత్వం అందించిన ఈ డబ్బు మీ భవిష్యత్తుకు పునాది కావాలి. దీనిని ఎలాంటి విలాసాలకు, అనవసర ఖర్చులకు వృథా చేయకుండా.. సక్రమ మార్గంలో స్థిరపడటానికి, గౌరవప్రదమైన జీవనోపాధిని ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే వాడుకోవాలన్నారు.

​జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ చేయూత” కార్యక్రమం మావోయిస్టుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతోందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆకర్షితులై లొంగిపోయే ప్రతి ఒక్కరికీ పోలీస్ శాఖ కొండంత అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులకు మెరుగైన పునరావాసం కల్పించడంతో పాటు, భవిష్యత్తులో వారికి అందవలసిన అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో అందిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. భ్రమలను వీడి, ఆయుధాలు పక్కన పెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>