కలం, వెబ్‌డెస్క్: పిల్లలు మానసింగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి సరైన నిద్ర చాలా అవసరం. రోజంతా ఆడుకుని బాగా అలసిపోయిన పిల్లలు రాత్రి సమయంలో సరైన నిద్రతో పాటు నాణ్యమైన నిద్ర పోవడం కూడా ముఖ్యం. అయితే కొంతమంది తల్లిదండ్రులు తెలియక చేసే పొరపాట్లు పిల్లల నిద్రను డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇది పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అయితే తల్లిదండ్రులు తెలియక చేసే పొరపాట్లు (Parenting Mistakes) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తల్లిదండ్రులు చేయకూడని పొరపాట్లు
పిల్లలను కోపగించుకోవడం
ఉద్యోగాలు, వ్యాపారాల ఒత్తిడి వల్ల రోజంతా అలసిపోయిన తల్లిదండ్రులు ఇంటికి రాగానే కాస్త ప్రశాంతతను కోరుకుంటారు. కానీ, పడుకునే సమయంలో పిల్లలు చేసే అల్లరి వల్ల తెలియకుండానే వారిపై కోపం, చిరాకు చూపిస్తుంటారు. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలు నిద్రపోయే ముందు మనం మాట్లాడే మాటలే వారి మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును డిసైడ్ చేస్తాయట! అందుకే రాత్రివేళల్లో పిల్లల్లో పాజిటివిటీని పెంచేలా ప్రవర్తించాలి.
స్క్రీన్ టైమ్
ఈ రోజుల్లో పడుకునే ముందు ఫోన్ చూడటం వ్యసనంగా మారిపోయింది. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలను పడుకోమని చెప్పి వారు మాత్రం స్క్రీన్ చూస్తుంటారు. కానీ పిల్లలు సరిగ్గా నిద్రపోయే ముందు తల్లిదండ్రులు ఎక్కువగా ఫోన్ లేదా టీవీ చూడడం వల్ల కళ్లపై ఎఫెక్ట్ పడుతుంది. స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఎక్కువగా తగలడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బ తింటుంది. దీనివల్ల స్లీప్ సైకిల్ పూర్తిగా మారిపోతుంది. ఇది పిల్లల జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
నిర్దిష్ట సమయం లేకపోవడం
కొంత మంది తల్లిదండ్రులు అస్సలు సమయపాలన పాటించకుండా పిల్లలను ఎప్పుడూ పడితే అప్పుడు పడుకోబెడుతుంటారు. అర్ధరాత్రి వరకూ పిల్లలను మెలకువతో ఉంచడం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేపడం వారి స్లీప్ సైకిల్ ను దెబ్బతీస్తుంది. ఇలా చేయడం వల్ల వారి మెదడు పనితీరు సరిగ్గా ఉండదని చెబుతున్నారు నిపుణులు. అందుకే పిల్లలను రోజూ ఒకే సమయానికి పడుకోబెట్టాలి. దీనివల్ల ఆ సమయం కాగానే మెదడు నిద్రపోవాలని సిగ్నల్స్ పంపుతుందని చెబుతున్నారు నిపుణులు.
నిద్రను శిక్షగా మార్చడం
కొంతమంది తల్లిదండ్రులు డిసిప్లేన్ పేరుతో పిల్లలకు నిద్ర రాకపోయినా తిట్టి, కొట్టి పడుకోబెడుతుంటారు. ఇలా చేయడం వలన పిల్లలకు నిద్ర అంటేనే చిరాకు వస్తుంది. అప్పుడు నిద్రపై వారికి ప్రతికూల దృష్టి ఏర్పడుతుంది. సహజంగా జరగాల్సిన ఈ ప్రక్రియను వారు శిక్షగా భావిస్తారు. ఫలితంగా లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే అతి డిసిప్లేన్ పనికిరాదని చెబుతున్నారు నిపుణులు.
మరీ బిజీ చేయకండి
ఈ రోజుల్లో పిల్లలు అన్ని రంగాల్లోనూ ముందుండాలనే తాపత్రయంతో చాలా మంది తల్లిదండ్రులు వారిని స్కూల్ కాగానే రకరకాల యాక్టివిటీస్, కోచింగ్‌లతో బిజీగా మార్చేస్తున్నారు. ఇవన్నీ పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయేమో కానీ, వారిపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని (Stress) పెంచుతున్నాయి. దీనివల్ల వారికి సరిగ్గా నిద్రపట్టక ఆలస్యంగా పడుకురి ఆలస్యంగా నిద్ర లేస్తారు. ఇది పిల్లల నిద్ర సమయాన్ని దెబ్బతీస్తుంది. అందుకే పిల్లలు పడుకునే రెండు గంటల ముందు వరకు వారిని ఎటువంటి ఒత్తిడికి గురిచేయకుండా ప్రశాంతంగా పడుకోనివ్వాలని సూచిస్తున్నారు నిపుణులు.

