కలం, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి (Srikalahasti)లో దారుణం చోటు చేసుకుంది. అప్పు చెల్లించడం లేదని ఏకంగా పసికందునే కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. శివనాథపాలెం గ్రామానికి చెందిన ఆది, మేఘమాల దంపతులు మునెమ్మ, ప్రసాద్, మోహన్ అనే వ్యక్తుల వద్ద రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీసుకుని ఏడు నెలలవుతున్నా చెల్లించడం లేదని.. ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆది, మేఘమాల దంపతుల ఆరు నెలల పసికందును ఎత్తుకెళ్లిపోయారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి పసికందును రక్షించారు. ఇది నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పు ఇవ్వకపోతే.. పసికందును కిడ్నాప్ చేస్తారా.. అని ప్రశ్నిస్తున్నారు. పసికందును కిడ్నాప్ చేసి, వారికి మానసిక వేదన కలిగించినందుకు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

