కలం, ఖమ్మం బ్యూరో: శుక్రవారం సాయంత్రం నుంచి అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి ఆరాధ్య కథ విషాదాంతమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మామిడిగుండాల పంచాయతీ పరిధిలోని రాజ్య తండాలో శనివారం సాయంత్రం చిన్నారి మృతదేహం స్థానిక చెరువులో లభ్యమైంది. రాజ్య తండాకు(Rajya Thanda) చెందిన ఐదేళ్ల బాలిక ఆరాధ్య శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఇల్లెందు సీఐ సురేష్ తన సిబ్బందితో పాటు గ్రామస్తుల సహకారంతో రాత్రంతా తండా పరిసరాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
అయినప్పటికీ చిన్నారి ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం ఉదయం నుంచి పోలీసులు, స్థానికులు మరోసారి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సాయంత్రం గ్రామ సమీపంలోని చెరువు మధ్యలో చిన్నారి ధరించిన దుస్తులు కనిపించాయి. అనుమానంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా, ఆరాధ్య నీటిలో మునిగి విగతజీవిగా కనిపించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో రాజ్య తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

