కలం, ఖమ్మం బ్యూరో: హైదరాబాద్లో దారుణంగా మృతి చెందిన ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష భౌతికకాయం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసుకుని ఆదివారం రాత్రి స్వగ్రామానికి చేరుకుంది. అమాయకపు యువతి మృతదేహాన్ని కడసారి చూసేందుకు సోమవారం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలిరావడంతో చౌటిగూడెం శోకసంద్రంలో మునిగిపోయింది. కూతురిని కోల్పోయిన బాధలో ఉన్న ఆ పేద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి.ఈ క్లిష్ట సమయంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే (Aswaraopeta MLA) జారే ఆదినారాయణ బాధిత కుటుంబానికి కొండంత అండగా నిలిచారు.
భౌతికకాయం గ్రామానికి చేరుకున్న సమయం నుంచి కంటిమీద కునుకు లేకుండా రాత్రంతా కుటుంబ సభ్యుల వద్దే ఉండి వారిని ఓదారుస్తూ ధైర్యం చెప్పారు. శిరీష కుటుంబ పరిస్థితిని ఆరా తీసి, వారికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా బాధ్యత కలిగిన పెద్దదిక్కుగా ఎమ్మెల్యే రాత్రంతా అక్కడే ఉండి ధైర్యం నింపడం బాధితులకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది.
శిరీష భౌతికకాయానికి మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, దమ్మపేట మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తదితరులు కడసారి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపిన నేతలు, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

