కలం, ఖమ్మం బ్యూరో: సిరులు కురిపించే నల్ల బంగారాన్ని వెలికితీసే సింగరేణి సంస్థకు 135 సంవత్సరాల చరిత్ర ఉంది (Singareni Vs TG GENCO). అలాంటి సంస్థకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఓసీ–2 డిప్ సైడ్ గని కీలకమైన ఆస్తిగా సింగరేణి కార్మికులు చెప్తుంటారు. అధిక నాణ్యతతో కూడిన బొగ్గు నిల్వలు ఉన్న ఈ గని సింగరేణి భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్ రిజర్వుడ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న ఈ బ్లాక్‌లో సుమారు 20 సంవత్సరాలకు పైగా సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నట్లు సింగరేణి యాజమాన్యం చేసిన పరిశోధనలో తేలింది. అయితే, ఇప్పుడీ గని సింగరేణికి దక్కుతుందా లేదా అనేమానాలు వ్యక్తమవుతున్నాయి.
బకాయిలున్నా.. బరిలోకి జెన్‌కో!
ఇటీవల నిర్వహించిన జాతీయ బొగ్గు గనుల వేలంలో.. మణుగూరు గనిని దక్కించుకోవాలని తెలంగాణ జెన్‌కో రంగంలోకి దిగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే టీజీ జెన్‌కో కు బొగ్గు వెలికితీతలో అనుభవం లేదు. ఆదాయం పరంగా చూసినా, ఇప్పటికే జెన్‌కో సింగరేణికి సుమారు రూ.17,757 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. డిస్కంలతో కలిపితే ఈ బకాయిలు రూ.43,000 కోట్లకు పైగా ఉండొచ్చు అనేది బహిరంగ రహస్యమే. ఇలాంటి పరిస్థితుల్లో.. సింగరేణికి బొగ్గు కొనుగోలు చేసిన డబ్బులు కూడా చెల్లించలేని జెన్‌కో, ఇప్పుడు అదే సింగరేణితో వేలంలో పోటీ పడటం కార్మిక సంఘాలు, స్థానిక నాయకుల్లో సందేహాలు రేకెత్తిస్తోంది.
2020 తర్వాత కేంద్రం బొగ్గు గనులను కేటాయింపు పద్ధతిలో కాకుండా, వేలం విధానంలోనే నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జెన్‌కో పోటీ పడటం వెనుక రాజకీయ వ్యూహం ఉందా? లేక ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి ఈ గని వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నమా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది(Singareni Vs TG GENCO).
మొత్తానికి మణుగూరు ఓసీ–2 డిప్ సైడ్ గని ఎవరికీ దక్కుతుందనే అంశం ప్రస్తుతం సింగరేణి వర్గాలు, కార్మికులు, స్థానిక ప్రజల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ గని సింగరేణికే దక్కితేనే ఈ ప్రాంతం అభివృద్ధి, కార్మికుల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణికే దక్కాలి..
మణుగూరు ఓసీ–2 డిప్ సైడ్ బొగ్గు సింగరేణికే దక్కాలి. ఈ గని సింగరేణికి దక్కకపోతే సంస్థ ఆదాయంతోపాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతాయి. తెలంగాణ జెన్ కో.. సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా, కొత్త గనులు కూడా దక్కకుండా చేయడం సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగమే అవుతుంది. మణుగూరు గనిని సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తెస్తే బావుంటుంది.
– రాజేశ్వర్ రావ్, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి, మణుగూరు.

