కలం, స్పోర్ట్స్ : ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ పోటీదారులను నిర్ణయించే 2028 ఫిడే క్యాండిడేట్స్ టోర్నీకి (World Chess Candidates) కొత్త అర్హత విధానాన్ని ఫిడే ప్రకటించింది. పురుషులు, మహిళల క్యాండిడేట్స్ టోర్నీలకు ఒకే తరహా నిబంధనలు అమలు చేయనుంది. ఇక నుంచి ప్రపంచ ర్యాంకింగ్ కంటే ప్రధాన టోర్నీల్లో నిలకడైన ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనుంది. కొత్త విధానంలో ‘టోటల్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టూర్ 2026-27’ను నేరుగా అర్హత సాధించే మార్గంగా చేర్చింది.
ఈ టూర్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు 2028 క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత పొందుతారు. మరో కీలక మార్పు వరల్డ్ కప్‌కు సంబంధించినది. 2027 నుంచి ఓపెన్, మహిళల వరల్డ్ కప్‌లలో ఫైనల్ చేరిన ఇద్దరు ఆటగాళ్లకే క్యాండిడేట్స్ బెర్త్ లభిస్తుంది. గతంలో ముగ్గురు అర్హత సాధించే అవకాశం ఉండేది. అలాగే ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా ఇచ్చే అర్హతను పూర్తిగా తొలగించింది. ఇకపై గ్రాండ్ స్విస్, వరల్డ్ కప్, టోటల్ చెస్ టూర్, మహిళల గ్రాండ్ ప్రిక్స్, ఫిడే సర్క్యూట్ వంటి టోర్నీల్లో ప్రదర్శన ఆధారంగానే అన్ని స్థానాలు భర్తీ అవుతాయి.
పురుషులు, మహిళల క్యాండిడేట్స్ టోర్నీల్లో ఎనిమిది మంది ఆటగాళ్లు పాల్గొంటారు. గ్రాండ్ స్విస్ నుంచి ఇద్దరు, వరల్డ్ కప్ నుంచి ఇద్దరు, టూర్ లేదా మహిళల గ్రాండ్ ప్రిక్స్ నుంచి ఇద్దరు, ఫిడే సర్క్యూట్ నుంచి మరో ఇద్దరు అర్హత సాధిస్తారు. ఈ మార్పులతో అర్హత ప్రక్రియ మరింత సమతుల్యంగా, పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా మారుతుందని ఫిడే అధ్యక్షుడు అర్కాడీ ద్వోర్కోవిచ్ తెలిపారు. ఆటగాళ్లకు ప్రతిభతోనే క్యాండిడేట్స్ చేరే అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

