కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సురభి మెడికల్ కాలేజీకి (Surabhi Medical College) గ్రామ పంచాయతీ అధికారులు జప్తు నోటీసులు(Attachment Notice) జారీ చేశారు. కాలేజీ యాజమాన్యం గ్రామ పంచాయతీకి రూ.49 లక్షల మేర పన్ను బకాయిపడటంతో ఈ చర్యలు చేపట్టారు. గతంలో కూడా పన్ను బకాయిలు చెల్లించాలని గ్రామ పంచాయతీ అధికారులు రెండుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కాలేజీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. దీంతో చివరి అవకాశంగా మూడు రోజుల్లోగా బకాయిపడిన మొత్తం పన్నును పూర్తిగా చెల్లించాలని, లేనిపక్షంలో కాలేజీ ఆస్తులను జప్తు చేస్తామని అధికారులు హెచ్చరించారు. సురభి మెడికల్ కాలేజీ యాజమాన్యం బకాయిపడిన రూ.49 లక్షల పన్నును వెంటనే గ్రామ పంచాయతీకి చెల్లించి సహకరించాలని పంచాయతీ కార్యదర్శి స్పష్టం చేశారు.

