కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని గణేష్ నిమజ్జన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు (DJ Ban in Jagtial) జగిత్యాల రూరల్ ఎస్ఐ ఆర్. ఉమాసాగర్ (SI Umasagar) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సోమవారం గణేష్ మండపాల నిర్వాహకులు, యువజన సంఘాలకు విజ్ఞప్తి చేశారు. అధిక శబ్దంతో కూడిన డీజే సౌండ్ వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఎస్ఐ ఉమాసాగర్ పేర్కొన్నారు.
ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అధిక శబ్దం కారణంగా రక్తపోటు, గుండె వేగం పెరగడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు తెలిపారు. డీజేలకు బదులుగా సంప్రదాయ డప్పులు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని జగిత్యాల రూరల్ మండల ప్రజలకు ఎస్ఐ ఉమాసాగర్ సూచించారు.
నిమజ్జన ఊరేగింపులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. నిబంధనలను ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగించే సౌండ్ సిస్టమ్‌లను సీజ్ చేసే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు, యువజన సంఘాలు, భక్తులు పోలీసులకు సహకరించాలని జగిత్యాల రూరల్ ఎస్ఐ ఉమాసాగర్ విజ్ఞప్తి చేశారు.

