కలం, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద తెలంగాణకు రెండు లక్షల ఇళ్లను కేటాయించి, తొలి విడత నిధులు అందించామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని, సర్వేలో గుర్తించిన ఇళ్ల లబ్ధిదారులను తదుపరి దశల్లో చేర్చుతామని చెప్పారు.
రైతుల ఆదాయాలను పెంచడం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం, ఆహార భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సు హైదరాబాద్లో నిర్వహించగా.. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశమే మొదటి ప్రాధాన్యమని, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందన్నది ముఖ్యం కాదని చౌహాన్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత మూడు ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.
ఏఐ వ్యవసాయానికి ప్రత్యామ్నాయం కాదు..
ఏఐ, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు అభివృద్ధి చెందినా వ్యవసాయానికి ప్రత్యామ్నాయం లేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. యంత్రాలు రొట్టెలు తయారు చేస్తాయి తప్ప గోధుమలు పండించలేవన్నారు. రాష్ట్రాల వాతావరణం, నీటి వనరులు, నేల స్వభావం వేర్వేరుగా ఉన్నందున ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
కాలం చెల్లిన చట్టాలు, విధానాల్లో మార్పులు అవసరమైతే రాష్ట్రాలు కేంద్రానికి సూచనలు చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. నియమాలు ప్రజల కోసం ఉండాలి తప్ప ప్రజలు నియమాల కోసం కాదని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో కొబ్బరి, జీడిపప్పు, కోకో, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, ఉద్యాన పంటలకు భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కొబ్బరి ఎగుమతులు ఏడాదిలో రూ.4,349 కోట్ల నుంచి రూ.7,038 కోట్లకు పెరిగాయని, 62 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు.

