మూసీ కాలుష్యంపై అసెంబ్లీలో కుంభం అనిల్‌ గళం

కలం, భువనగిరి: మూసీ నది కాలుష్య నియంత్రణతో పాటు గ్రామాల సమీపంలోని పరిశ్రమల వ్యర్థాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను భువనగిరి ఎమ్మెల్యే(Bhuvanagiri MLA) కుంభం అనిల్ కుమార్ రెడ్డి శాసనసభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. భువనగిరి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం, భద్రత పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకెళ్లారు. మూసీని పూర్తిస్థాయిలో కాలుష్యరహితంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ.. నదిలోకి చేరుతున్న రసాయన వ్యర్థాలు, పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు.

భువనగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పరిశ్రమల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు, వ్యర్థాలతో పర్యావరణం దెబ్బతింటోందని, కొన్ని పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదాల కారణంగా ప్రాణనష్టం జరిగిన ఘటనలు కూడా ఉన్నాయని సభకు వివరించారు. గ్రామాలకు సమీపంలో ఉన్న పారిశ్రామిక యూనిట్లపై కాలుష్య నియంత్రణ మండలి కఠిన పర్యవేక్షణ చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజా భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి లేవనెత్తిన మూసీ ప్రక్షాళన, పారిశ్రామిక కాలుష్య నియంత్రణ అంశాలపై సంబంధిత మంత్రి అసెంబ్లీలో సానుకూలంగా స్పందించారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యానికి హాని కలిగించే పరిశ్రమలపై తనిఖీలు ముమ్మరం చేస్తామని, కాలుష్య నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందించి తగిన చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>