కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే (Digital Crop Survey), క్రాప్ బుకింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ క్రాప్ సర్వే, క్రాప్ బుకింగ్‌పై సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకట రమణ రెడ్డి, వ్యవసాయ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న డిజిటల్ క్రాప్ సర్వే, క్రాప్ బుకింగ్ ప్రక్రియపై కలెక్టర్ సమీక్షించారు. క్షేత్రస్థాయిలో వాస్తవంగా సాగులో ఉన్న పంటల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ద్వారా పంటల సాగు విస్తీర్ణం, పంటల సరళి, సాగు చేయని భూములు తదితర అంశాలపై నమ్మకమైన సమాచారం లభిస్తుందని అధికారులు వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో పంటల సాగులో చోటుచేసుకునే మార్పులను క్షేత్రస్థాయిలో గుర్తించాలని కలెక్టర్ సూచించారు. రైతులకు పంటల వైవిధ్యీకరణపై అవగాహన కల్పిస్తూ.. వర్షపాతం, నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు, తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకునేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.
డిజిటల్ క్రాప్ సర్వేలో సర్వేయర్ నమోదు చేసిన పంట వివరాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో సంబంధిత రైతుల మొబైల్ ఫోన్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపనున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు తమకు అందిన వివరాలను పరిశీలించి, ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పంటల వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నాణ్యమైన, పారదర్శకమైన పంట నమోదు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనతో పాటు రైతులకు అవసరమైన వ్యవసాయ సేవలను సమర్థవంతంగా అందించేందుకు అవసరమైన సమాచారాన్ని ఖచ్చితంగా సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

