కలం, నల్లగొండ: భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో గోవు (Cow) విశిష్ట స్థానాన్ని కలిగి ఉందని పూరి జగన్నాథ్ టెంపుల్ సాధువు శిఖర్ జీ (Shikhar Ji) పేర్కొన్నారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘గో ఆరాధన ఉద్యమ ఆహ్వాన వాల్ పోస్టర్’ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శిఖర్ జీ మాట్లాడుతూ.. గో సంరక్షణ, గో సేవ, గో వంశ పరిరక్షణే ధ్యేయంగా ఈ ఉద్యమం ముందుకు సాగుతుందని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టర్‌కు, అలాగే అన్ని మండలాల పరిధిలోని ఎమ్మార్వోలకు మొత్తం 33 డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను సమర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. గోవు పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకురావడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గో ఆరాధన ఉద్యమ రాష్ట్ర అధ్యక్షుడు బాబు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రబరి మహమ్మద్ అలీలతో పాటు పెద్ద సంఖ్యలో గో సేవకులు, గో భక్తులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

