కలం, వెబ్ డెస్క్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) స్పందించారు. తన సలహా ప్రకారమే రాజీనామా చేశారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నీట్ లీకేజీ వ్యవహారంతో గత కొంత కాలంగా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి శరద్ పవార్ మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో నిరసనలను తగ్గించేందుకు తనను ప్రధాన మంత్రి మోదీ సలహా కోరినట్లు వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంలో మోదీ తన సలహా కోరినట్లు వెల్లడించారు.
అయితే, కేంద్రమంత్రి గా ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని ప్రధానికి సలహా ఇచ్చినట్లు చెప్పారు. తన సలహా స్వీకరించిన మోదీ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రదాన్ తో రాజీనామా చేయించారని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
కాగా, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు, విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీతో ఈ నెల 22 శరద్ పవార్ సమావేశం అయ్యారు. శరద్ పవార్ తో పాటు ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ప్రధాన మంత్రి ఆఫీసులో జరిగిన ఈ సమావేశం అప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బేటీ జరిగిన తరువాత కొన్ని రోజులకే కేంద్రమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేశారు. దీనికి తన సలహానే కారణం అని శరద్ పవార్ చెప్పుకోవడం గమనార్హం.

