కలం, కరీంనగర్: కాంగ్రెస్ (Congress) పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు (Velichala Rajender Rao) అన్నారు. శనివారం కొత్తపల్లి (Kothapalli) ప్రజా కార్యాలయంలో బావుపేట ఆసిఫ్‌నగర్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొత్తపల్లి మండల దూదేకుల సంఘం అధ్యక్షుడు మహమ్మద్ హసన్, ఎండి నయీమొద్దీన్, ఎండి జావేద్, ఎండి రఫీక్, ఎండి అమీర్, రావణవేణి తిరుపతితో పాటు పలువురు నాయకులకు రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లి పార్టీకి మరింత ఆదరణ తీసుకురావాలని సూచించారు. ప్రజల విశ్వాసమే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద బలమని పేర్కొన్న రాజేందర్ రావు, రానున్న రోజులలో మరింత మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరనున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలగందుల సర్పంచ్ నిమ్మల అంజన్న, ఉపసర్పంచ్ గసికంటి కుమార్, ఏఎంసీ డైరెక్టర్ రావణవేణి సంపత్, మాజీ ఎంపీటీసీ బోనాల కనకయ్య, కాంగ్రెస్ నాయకులు బోనాల అశోక్, గుర్తూరి మురళి తదితరులు పాల్గొన్నారు.

