కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రితేష్ రాథోడ్ (Rithesh Rathod) బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర దాటిన తర్వాత మంగళవారం మామడ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించలేదనే విమర్శలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
రితేష్ పై తొలినుంచే అసంతృప్తి..
రితేష్ రాథోడ్‌ను నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన సమయంలోనే పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకుల నుంచి అసంతృప్తి వ్యక్తమైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించే ఆయనకు నిర్మల్ జిల్లా బాధ్యతలు అప్పగించడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి పార్టీ కార్యక్రమాల్లో కొనసాగారు. అయితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా స్థాయి సమావేశాలు, మండలాలు, గ్రామాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించకపోవడం పార్టీ కేడర్ లో అసంతృప్తికి కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర కార్యక్రమాలకే పరిమితమా?
పార్టీ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చే కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షుడు పాల్గొంటున్నప్పటికీ.. జిల్లాలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై అదే స్థాయిలో దృష్టి లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మండల, గ్రామ స్థాయి కార్యకర్తల సమస్యలను తెలుసుకునేందుకు తరచూ సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా, చాలాకాలం తర్వాత ఇప్పుడు మండల సమావేశాలు ప్రారంభించడం ఎందుకనే ప్రశ్నలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి.
పదవీకాలం ముగిసే వేళ సమావేశాలా..?
జిల్లా అధ్యక్షుడి పదవీకాలం పూర్తయ్యే సమయం సమీపిస్తున్న తరుణంలో మండల సమావేశాలు నిర్వహించడం పార్టీలో మరో చర్చకు దారితీసింది. ఏడాదిన్నర కాలం తర్వాత ఇప్పుడు మండల సమావేశాలు నిర్వహిస్తే క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎంతవరకు ప్రయోజనం అనే ప్రశ్నను కొందరు నాయకులు లేవనెత్తుతున్నారు. నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు, బాధ్యతలు దక్కడం లేదనే అసంతృప్తి కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పలువురు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, ఆ క్యాడర్ ను సమన్వయం చేసి నిరంతరం అందుబాటులో ఉండటం జిల్లా అధ్యక్షుడి ప్రధాన బాధ్యత. మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలతో నేరుగా మమేకమైతేనే పార్టీ కార్యక్రమాలు బలంగా సాగుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రారంభమైన మండల సమావేశాలు కేవలం కార్యక్రమాలకే పరిమితం అవుతాయా లేక కార్యకర్తలతో సమన్వయం పెంచి పార్టీ సంస్థాగత బలాన్ని పెంచే దిశగా కొనసాగుతాయా అనేది వేచి చూడాల్సిందే.

