కలం, భువనగిరి : రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సుమారు 80 నుంచి 100 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయమని హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి (Shanampudi Saidireddy) ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మోదీ 12 ఏళ్ల పాలన-విజయాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో సైదిరెడ్డి పాల్గొని మాట్లాడారు. రానున్న ఆరు నెలల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చూస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్లుగా దేశంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, జాతీయ రహదారుల నిర్మాణం, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటూ, స్కీములు, స్కాములతో కాలం గడుపుతోందని సైదిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు అప్పులు తెస్తోందని, ఆ డబ్బు ఎటు పోతుందో ఎవరికీ అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు. చివరకు ఉపాధ్యాయులకు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు, బిల్లులు కూడా సకాలంలో చెల్లించలేని దుస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటే, తెలంగాణ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి, వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాలని, అవినీతి రహిత పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని ఆయన అన్నారు. రాబోయే 2028 ఎన్నికల్లో ఆరు నూరైనా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, 100 సీట్లతో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

