కలం, కరీంనగర్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే తిరిగి అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష హోదా కాదు, పాలక పక్ష హోదా ఇవ్వబోతున్నారని కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు, SIRపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. “హుజురాబాద్ అంటే కేసీఆర్‌కు ఎంతో ప్రేమ కాబట్టే రైతు బంధు, దళిత బంధు ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలు కాకుండా మరో 500 పథకాలు ప్రవేశ పెట్టారు. గత ఎన్నికల్లో కృతజ్ఞత, ఆశకు మధ్య పోటీ జరిగితే రేవంత్ రెడ్డి (Revanth Reddy) పెట్టిన ఆశ గెలిచింది. ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా, ఎరువులు, వడ్ల కొనుగోళ్లు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు” అని ఆవేదన వ్యక్తంచేశారు.
మేం వచ్చాకే మేడిగడ్డ మరమ్మతులు చేయిస్తాం..
కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీని మరమ్మతు చేసే పరిస్థితి లేదని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే పనులు ప్రారంభిస్తామని హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. “రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు హామీ ఇచ్చిన పథకాలు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బీఆర్ఎస్ గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ తన పరిస్థితిని చూసుకోవాలి. రాబోయే ఎన్నికల్లో వారి పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ చేసిన సేవలను ప్రజలు మరచిపోలేదు.
రాష్ట్ర ప్రజలు మరోసారి గులాబీ జెండాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. దానికి తాజా రాజకీయ పరిణామాలే నిదర్శనం. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ ప్రధాన శక్తిగా అవతరించడం ఖాయం” అని హరీష్ రావు స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో డంపింగ్ యార్డు విషయాన్ని అసెంబ్లీ లో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు తదితరులు ఉన్నారు.
Read Also: జీవో 190ని తక్షణమే అమలు చేయాలి: కవిత
Follow Us On : WhatsApp

